Thursday, August 20, 2015

నాగులచవితి విశిష్ఠత



నాగులచవితి విశిష్ఠత

 నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?


కార్తికేతు సితే పూజ్యః చతుర్ధ్యాం కార్తికేయకః!
మహాచతుర్ధీ సా ప్రోక్తా సర్వపాపహరం శుభా!!

దీపావళి అనంతరం వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగులచవితి అంటారు. రోజు నాగదేవతను పూజిస్తారు. కార్తీకశుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకరంలో ఉంటుంది. కనుక ఈచవితిని నాగుల చవితి అని పిలుస్తారు.

తెల్లవారుజామునే స్నానం చేసి, నువ్వులు, బెల్లంతో చిమ్మిలి, బియ్యం నాన బెట్టి పిండి చేసి బెల్లం, కొబ్బరి వేసి చలిమిడి చేస్తారు. నాగేంద్రుని పుట్టదగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళు,తాటిగుంజు నైవేద్యం పెడతారు. ఆవుపాలు పుట్టలో పోస్తారు. చిమ్మిలి, చలిమిడి పుట్టలో వేస్తారు.

 "పడగ తొక్కితే పారిపోయి, నడుం తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి, కళ్ళు, కాలు ఇచ్చి చల్లగా చూడు తండ్రీ!" అంటూ నాగేంద్రుని ప్రార్ధిస్తారు.

సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వాటినే ఫలహారంగా తింటారు. ఇలా చేయడం వల్ల పుణ్యం లభించటమే కాకుండా చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలతో చన్నీటి స్నానాలు చేయించటం వాళ్ళ చేవిలోపోటు రాదనీ, కళ్ళకి మంచిదని భావిస్తారు

శ్రావణ మాసం



శ్రావణ మాసంలో మన విధులు
శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.
స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.
ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు మేఘాలు వర్షాధారలతో దేశమును చల్లపరుచునపుడు కృష్యాడి కార్యములు నిర్విఘ్నంగా సాగాగాలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.



సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"
చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.
శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.
పాడ్యమి - బ్రహ్మదేవుడు విదియ - శ్రీయఃపతి తదియ - పార్వతీదేవి చవితి - వినాయకుడు పంచమి - శశి షష్టి - నాగదేవతలు సప్తమి - సూర్యుడు అష్టమి - దుర్గాదేవి నవమి - మాతృదేవతలు దశమి - ధర్మరాజు ఏకాదశి - మహర్షులు ద్వాదశి - శ్రీమహావిష్ణువు త్రయోదశి - అనంగుడు చతుర్దశి - పరమశివుడు పూర్ణిమ - పితృదేవతలు
మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.
మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది వ్రతం. వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.
వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.
శ్రావణమాసంలో వచ్చే పండగలు
శుక్లచవితి-నాగులచవితి మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.
శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.
పూర్ణిమ - హయగ్రీవ జయంతి వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.
కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి క్రీ..1671 సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.
కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.
కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.